ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదు. సర్వే నంబర్లు మార్చేసి.. తప్పడు సమాచారంతో అనుమతులు పొంది.. భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది అని హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ తెలిపారు. హైడ్రా కూల్చిన తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలి. లేని పక్షంలో వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చింది. కొంతమంది నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తుండగా.. మరి కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరి కొంతమంది అక్కడ ఉన్న విలువైన ఇనుప చువ్వలు, ఇతర సామగ్రిని తీసుకుని వ్యర్థాలను వదిలేస్తున్నారు. కానీ అక్కడ పూర్వ స్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్యత బిల్డర్లపైనే ఉంది. విలువైన వస్తువులు తీసుకెళ్లి మిగతా వ్యర్థాలను అక్కడే వదిలేయడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది.
చెరువులకు పునరుజ్జీవనం కల్పించే క్రమంలో హైడ్రానే చొరవచూపి.. అక్కడ నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చును నిర్మాణదారుడి నుంచి వసూలు చేస్తుంది. నిర్మాణ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను కూడా టెండర్ల ద్వారా పిలిచి అప్పగించడమౌతోంది. ఇంకా మిగిలిపోయిన ఇనుప చువ్వలను వేరుచేసి.. వ్యర్థాలను తొలగిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కొన్ని మీడియా సంస్థలు హైడ్రా చర్యల పట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా.. ప్రచారం చేస్తున్నాయి అని రంగనాథ్ పేర్కొన్నారు.