అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి, ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జా చేస్తున్న వారికి హైడ్రా హడల్ పుట్టిస్తోంది. ఈ విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తూ అక్రమకట్టడాలు నేలమట్టం చేస్తోంది. తాజాగా రోడ్డుకు అడ్డంగా కట్టిన ప్రహరీని కూల్చివేసింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్‌గూడలో బుల్డోజర్లతో విరుచుకుపడింది.బోయప్లలి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు ఇచ్చారు.
బోయపల్లి ఎంక్లేవ్ కాలనీ లేఅవుట్‌లో దాదాపు సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహరీతో ఇతర ప్లాట్ల యజమానులు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేసిన హైడ్రా గ్రామ పంచాయతీ లే అవుట్, బోయపల్లి ఎంక్లేవ్ లే అవుట్లను పరిశీలించింది. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా మూడు చోట్లు నిర్మించిన ప్రహారీని నేలమట్టం చేసింది. తొలగింపు సమయంలో హైడ్రా అధికారులకు, భూ యజమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది.