తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సేట్స్ మోనిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ( హైడ్రా) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షణ్యంగా తొలగించడం సంచలనం రేపుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరి ఇంటిని హైడ్రా వదలడం లేదు.
అక్రమ నిర్మాణాదారులే కాదు.. నిబంధనలను నీళ్లకు వదిలిన అధికారులకు హైడ్రా సెగ తగిలింది. ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు కూడా సిద్ధమైంది. హైడ్రా ఇప్పటివరకు 19 ప్రాంతాల్లో చిన్న పెద్దవి కలిపి సుమారు 200 కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు సమాచారం. ఇలా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కూల్చివేతలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు. కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని కూలుస్తున్నట్లు తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చి వేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఇక కమిషనర్ రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇల్లు నిర్మించుకొని ఉంటున్న యాజమానులకు భారీ ఊరట లభించింది.