ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఓ భవనం కుప్పకూలి ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 28 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు లక్నో లో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ పోర్ట్ నగర్ లోని మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మూడంతస్తుల భవనంలో గిడ్డంగులు పనులు నిర్వహిస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.