కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కొరికాయి ఎలుకలు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుక కరిచిన ఘటన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. కామారెడ్డికి చెందిన షేక్ ముజీబ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి రోగులందరూ నిద్రలోకి జారుకున్నాక ఎలుకలు ఆసుపత్రిలో సంచరించాయి. ఎలుక కరవడంతో ముజీబ్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే…కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులైన డాక్టర్లు, నర్స్‌ను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులను సస్పెండ్ చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ఐసీయూ ఇంచార్జ్ డాక్టర్ కావ్య, ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్‌చార్జ్ డాక్టర్ వసంత్ కుమార్, డ్యూటీ నర్స్ జి.మంజుల విధుల్లో నిర్లక్ష్యం వహించారని, అందుకే ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి హాస్పిటల్ ఇదివరకు వైద్య విధాన పరిషత్‌లో ఉండగా, గతేడాది మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసి డీఎంఈ పరిధిలోకి తీసుకొచ్చారు.