తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగా..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రేపు శ్రావణ సోమవారం, శ్రావణ పంచమి చాలా మంచి రోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లి టికెట్ ఆశిస్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ సీఎం కేసీఆర్ కి సన్నిహితుడు అయిన మధుసూదనాచిరికి భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎట్టి పరిస్థితులో మళ్లీ అవకాశం ఇవ్వకూడదని మాజీ స్పీకర్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అలా కాదని గండ్రకే టికెట్ ఇస్తే.. 150 మంది ఉద్యమకారులు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ అధిష్టానాన్ని హెచ్చరించారు.