ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళ లక్ష్మీ పై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంలచనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గిరిజన మహిళ లక్ష్మీపై దాడి చేసిన ఘటనకు సంబంధించి సీసీటీవీ పుటేజీని సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 15న ఎల్బీనగర్ పోలీసులు గిరిజన మహిళ లక్ష్మీపై దాడి చేశారు. తనపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని.. ఆరోపించారు లక్ష్మీ. ఈ విషయంపై జడ్జీ సూరేపల్లి నంద తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్ కి లేఖ రాశారు.
దీంతో ఈ కేసును తెలంగాణ హై కోర్టు సుమోటోగా తీసుకుంది. ఇవాళ ఈ ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్నటువంటి సీసీటీవీ పుటేజీని అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.మీర్ పేటకు చెందిన లక్ష్మీని ఎల్బీనగర్ పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయం పై రాచకొండ సీపీ చౌహన్ విచారణకు ఆదేశించారు.
విచారణ చేపట్టిన ఉన్నతాధికారలు ఇందుకు బాధ్యులైన ఇద్దరూ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాత్రి అంతా నిర్బంధించి తనపై పోలీసులు దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు.