రాష్ట్రంలో మూడో విడత రైతు రుణమాఫీ పథకం కింద పలువురు రైతులకు శుక్రవారం నుంచి నిధుల జమ మొదలైంది. అయితే రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. ఆ మొత్తం దాటిన వారికి జమ కాలేదని సమాచారం. రూ.2 లక్షలు దాటిన వారికి ఎప్పుడు చెల్లించాలనే దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లించాకే రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్దేశించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తాజా మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
మూడో విడత రుణమాఫీలో నిధులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వ్యవసాయాధికారులకు, బ్యాంకు అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. మరోవైపు మూడో విడత రుణమాఫీ పొందిన లబ్ధిదారుల జాబితా శుక్రవారం విడుదల కాలేదు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ ప్రకటన చేసిన వెంటనే జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. కానీ మూడో విడతలో అలా జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.