తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త అందింది. మరిన్ని గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరో 60 గ్రూప్-1 పోస్టులను పెంచుతూ తెలంగాణ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 60 కొత్త పోస్టులలో కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
ఇక అటు తెలంగాణలో EAPCET-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజాగా వెల్లడించింది. ఇదివరకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు ఈ ఏడాది నుంచి EAPCET అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 06 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ దరఖాస్తులను కూడా ఆన్ లైన్ లోనే సమర్పించాలని స్పష్టం చేశారు. మే 09 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.