తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈనెల 11వ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి రావడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూపొందించిన మార్గదర్శకాలు ఇవే..
- లబ్ధిదారుడు విధిగా దారిద్య్రరేఖ(బీపీఎల్)కు దిగువన ఉన్న వారై ఉండాలి. ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు.
- లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
- గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి.
- గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులే.
- అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.
- వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు.
- ఒంటరి(సింగిల్ ఉమెన్), వితంతు(విడోవర్) మహిళలూ లబ్ధిదారులే.
- ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు.
- ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
- గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
- లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు.
- జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్‌లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి.
- లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుసభలో ప్రదర్శిస్తారు.
- 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్‌సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాలి.