రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఇప్పటికే నాలుగింటిని సర్కారు అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమల్లోకి తీసుకురావడంపై సర్కార్ దృష్టి సారించింది. ఈ నెల 11వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనుంది. అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని రేవంత్ అధికారులకు సూచించారు. గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. స్థలం ఉన్నవారికి అదే స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయాలని, స్థలం లేని నిరుపేదలకు జాగాతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.అయిదు లక్షలు ఇస్తామని తెలిపారు. ఏయే దశల్లో నిధులను విడుదల చేయాలో నిబంధనలను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.