సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడిపాలని తెలంగాణ ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగకు ప్రతి ఏడాది అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగనుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు పర్యాటక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కైట్ ఫెస్టివల్‌లో 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాళ్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.