ఉన్నది ఒకటే జిందగీ.. ఏం సాధించినా ఇందులోనే : సజ్జనార్

-

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన ఓ యువకుడు వాటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ అనే యువకుడి సూసైడ్ చేసుకోవడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సమస్య ఏదైనా.. ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన తెలిపారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆన్ లైన్ లో ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర విమర్శలు చేశారు.

సోమేష్ సూసైడ్ పై స్పందిస్తూ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. “ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులై బలవన్మరణాలకు పాల్పడొద్దు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి బాధను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. సమస్య వచ్చినప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలో మార్గం ఆలోచించాలే తప్ప చనిపోవాలని అనుకోకూడదు. ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించిన అందులోనే.

జీవితంలో ఒక్కసారి కిందపడితే సర్వం కోల్పోయినట్లు కాదు. ఎంతో విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించకండి. వెలుగుచీకటిలా నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతాయి. కష్టమొస్తే ఆ బాధను ఇతరులతో షేర్ చేసుకోండి. పరిష్కార మార్గం ఆలోచించండి. కష్టం ఎల్లకాలం ఉండదు కదా.. చనిపోయినంత మాత్రాన సమస్యలు మాయమవుతాయా.. బలవన్మరణం వద్దు.. బతికి సాధించడమే ముద్దు” అంటూ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news