గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనను తలుచుకుంటే.. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రవీంద్రభారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఉద్యమంలో యువకులు పిట్టల్లా రాలిపోతుంటే.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా తీసుకొని మంత్రి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. సీఎం హోదాలో ధర్మకర్తలా ఉండాల్సిన గత సీఎం కేసీఆర్.. కేవలం నా కుటుంబం, నా రాజ్యం అనేలా మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవ్వరినీ పట్టించుకోకుండా వ్యవహరించారని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని తెలిపారు. రైతన్నలతో పాటు నేతన్నలకు కూడా రుణమాఫీ ప్రకటించామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.5వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇందుకోసం అప్పులు చేస్తుంటే.. ఎందుకు అప్పులు చేస్తున్నారని తిరిగి మమ్ముల్నే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన ప్రజలు, నేతన్నల కోసం తన సర్వసాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.