BREAKING : మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో పలు చోట్లు ఐటీ దాడులు జరుగుతున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో 40 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నల్గొండలోనే 30 బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లమోతు భాస్కరరావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల దృష్ట్యా భారీగా డబ్బులు నిల్వ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఇవాళ ఉదయం 4 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్న అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నల్లమోతు భాస్కరరావుకి దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్న విషయం తెలిసిందే. పలు పవర్‌ప్లాంట్లలో ఆయన భారీగా పెట్టుబడి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల సమయంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news