తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లలో అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేయడం ప్రస్తుతం కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రోహిత్ ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ నగదు బదిలీలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు ఓ అధికారి చెప్పినట్లు సమాచారం.
మరోవైపు హైదారాబాద్‌లోని పాతబస్తీలో సైతం ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాలు, కింగ్స్ ఫంక్షన్ హాళ్లు, హోటల్స్ యజమానుల ఇళ్లు, కోహినూర్ స్థిరాస్తి వ్యాపార సంస్థ యాజమాని నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.