గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే.. బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పులు చేయం అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని చెప్పారు. జహీరాబాద్ లోక్ సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు కేటీఆర్. ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పులను చూపించి కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు.