తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. బాలకృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని భువనగిరికి తరలించారు. ఆయన అంత్యక్రియలు భువనగిరి పట్టణ శివారులోని మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ పోరాటంలో ఉద్యమమే ఊపిరిగా పోరాడిన ఉద్యమకారుడు, మృదుస్వభావి.. జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.