కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలువురు ఇంజినీర్లు, గుత్తేదార్లు, అధికారులు, ప్రజాప్రతినిధులను కమిషన్ విచారించింది. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరికొందరిని విచారిస్తోంది.
ఈ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్.. శ్రీరాం నుంచి సమాచారం, వివరాలు సేకరిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం, అనుమతులు, నిర్వహణ లాంటి అంశాలపై ఆయన గతంలో పలుమార్లు మాట్లాడగా.. ప్రత్యేకించి మే నెలలో ఆనకట్ట కుంగిన సమయంలో వెదిరె శ్రీరాం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టకు సంబంధించిన అంశాలపై సమాచారం, వివరాలు ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను ఆదేశించారు. నేడు కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తున్నారు.