దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వాన పడుతోంది. ఏకధాటి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వాన కురుస్తుండటంతో పనులపై బయటకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696.25 అడుగులకు చేరింది. జలాశయలో 28,117 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 3 వరద గేట్ల ద్వారా 41,617 నీటి విడుదల చేస్తున్నారు. జలాశయ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నిమిష నిమిషానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 24 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,090.8 అడుగులకు చేరింది. ఇక పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.2 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.