కార్తికమాస చివరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

-

కార్తికమాసం ముగిసే సమయం ఆసన్నమైంది. ఇవాళ కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. భక్తులంతా తెల్లవారుజామునే శివాలయాలకు పోటెత్తారు. కోనేరులో పుణ్యస్నానాలు చేసి కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము నుంచి పోటెత్తుతున్న భక్తులతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు సందడిగా మారాయి.

ఏపీలోనిశ్రీశైలం, విజయవాడలతో పాటు తెలంగాణలోని వేములవాడ, ధర్మపురి, భద్రాచలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ ఆలయాలకు ప్రధానాలయాలకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు చేశారు. దీంతో విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద రద్దీ నెలకొంది. రాజమహేంద్రవరం, భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి దీపాలను వెలిగించి నదుల్లో వదిలారు. కార్తీక శోభతో శైవాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఆ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. కార్తిక మాసంలో వేకువజామునే పరమేశ్వరుడి ముందు దీపం వెలిగిస్తే అంతా శుభమే జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Read more RELATED
Recommended to you

Latest news