కాంగ్రెస్ కు కల్వకుంట్ల కవిత హెచ్చరికలు జారీ చేశారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు కవిత. బుధవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆమె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదన్నారు.
60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. 60 లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు… జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదు మాదన్నారు. మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి మాదని తెలిపారు కవిత.