అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లే అవకాశం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. ఈనెల 30 నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తా రైలును కాజీపేట, సికింద్రాబాద్‌ల నుంచి నడపనున్నట్లు వెల్లడించింది. కాజీపేట నుంచి 07223 నెంబరుతో జనవరి 30వ తేదీ, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 మొత్తం 15 ట్రిప్పులు నడపనున్నట్లు తెలిపింది. అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీలలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
మరోవైపు కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయోధ్యలో తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలు దేరి కాజీపేటకు మరునాటి రాత్రి 7.02 గంటలకు చేరుతుందని చెప్పింది.