పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు పర్యావరణ అనుమతి లభించింది. పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం సంతోషకరమని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైందని అన్నారు. ఎన్నో కేసులు, అడ్డంకులను ఎదుర్కొని, అకుంఠిత దీక్షతో ఈ అనుమతులను సాధించామని.. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులపై అభినందనల జల్లు కురిపించారు.
మరోవైపు హరీశ్ రావు స్పందిస్తూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వమైన ఆనందాన్నిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుందని అన్నారు. ఇది మాటల్లో వర్ణించలేని మధురఘట్టమంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.