రామోజీ రావుకు కేసీఆర్ ప్రభుత్వం కృతజ్ఞతలు చెప్పింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో నూతన తహసిల్దార్ కార్యాలయం ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తహసిల్దార్, ఆర్డీవో భవనాలను రూ. 4.5 కోట్లతో నిర్మించిన రామోజీ ఫౌండేషన్ కు,సంస్థ ఛైర్మెన్ రామోజీ రావుకి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడ ఆస్పత్రి నిర్మాణానికి కూడా ముందుకు రావడం సంతోషమని వెల్లడించారు.
బాధితుల పక్షాన నిలవడంలో ఈనాడు, ఈటీవి సంస్థలు ఎప్పుడు ముందు ఉంటాయని.. ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని…హైదరాబాద్ ను చూస్తే న్యూయార్క్ నగరంలా కనిపిస్తున్నదని ఒక సందర్భంలో సినీహీరో రజనీకాంత్ అన్నారని గుర్తు చేశారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వ అవార్డులు తెలంగాణకు ఎన్నో వస్తున్నాయని..ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 తెలంగాణ, వైద్యుల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ 1 అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని..కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.