హైదరాబాద్ ఓఆర్ఆర్ టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహా లోనే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ జరిగిందని అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను తక్కువ ధరకే ఐఆర్బికి కట్టబెట్టిందని ఆరోపించారు. ORR టెండర్ల నిబంధనలో కాంట్రాక్ట్ పొందిన సంస్థ 30 రోజుల్లో 25% డబ్బులు కట్టాలని.. 120 రోజుల్లో పూర్తి డబ్బు చెల్లించాలని ఉందన్నారు. ఇప్పుడేమో అలాంటి నిబంధనలే లేవంటూ హెచ్ఎండిఏ బుకాయిస్తుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఇక సీఎం కేసీఆర్ ఒక స్వాతిముత్యం అని.. మంత్రి హరీష్ రావు ఒక ఆణిముత్యం అని ఎద్దేవా చేశారు. 9 ఏళ్లలో తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని ప్రశ్నించారు. వారి పాలన బాగున్నట్లయితే కేటీఆర్, హరీష్ రావులు సెక్యూరిటీ లేకుండా విద్యార్థులతో చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందన్నారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాత్రదారులు కాగా.. మాజీ సిఎస్ సోమేశ్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ సూత్రధారులని ధ్వజమెత్తారు.