తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. నాకున్న సమాచారం మేరకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నేతలు విర్రవీగడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు.ఈడి లాంటి సంస్థలను వాడి తమకు కావలసిన వారికి ఎయిర్ పోర్టులను ఇప్పించుకున్నారని మండిపడ్డారు. గాడ్సే దేశభక్తుడని ఒక బీజేపీ ఎంపీ అంటుందని అన్నారు.
కేసీఆర్ దొర అయితే మా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు స్వేచ్ఛగా తిరిగేవారా అంటూ ప్రశ్నించారు. తొమ్మిది రాష్ట్రాల్లో బిజెపి బలవంతం చేసి అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిందని అన్నారు. వాళ్లకు తెలిసింది ఒకటేనని.. మోడీ – ఈడి, జుమ్లా – హమ్లా అంటూ ఎద్దేవా చేశారు. వీళ్ళ బలప్రదర్శనకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్లో వీళ్ల కన్నా పెద్దగా మేము సభ చేపట్టామని అన్నారు. మా ఐడియాలజీ నచ్చిన వారు మా నాయకునితోనే ఉంటారని తెలిపారు.