జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బుధవారం జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సర్వం సన్నద్ధమైంది. ఈ సభ నేపథ్యంలో ఖమ్మం నగరమంతా గులాబీమయంగా మారింది. భారీ హోర్డింగ్‌లు, నేతల కటౌట్లు, రహదారులకు రెండువైపులా తోరణాలతో ఖమ్మం కళకళలాడుతోంది.
ఈ సభకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి జాతీయ రాజకీయ సైరన్ మోగించి బీఆర్ఎస్ సత్తా చాటేలా ఈ సభను నిర్వహిస్తున్నారు.
అయిదు లక్షల మందిని సమీకరించేలా వారం నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేస్తోంది. సభలో 50 ఎల్‌ఈడీ తెరలు, 100 మొబైల్ టాయిలెట్స్, ఎనిమిది లక్షల మజ్జిగ, నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతోంది. 1,000 మంది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది.