బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్‌ను అపర భగీరథుడిగా కీర్తించిందని.. అన్ని ప్రాజెక్టులకూ కేసీఆరే చీఫ్ ఇంజినీర్ అని ప్రచారం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.లక్ష కోట్ల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసిందని వాపోయారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
“మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లపై కేంద్రానికి వెంటనే లేఖ రాశాం. ఉన్నతస్థాయి కమిటీ వచ్చి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరికొన్ని వివరాలు కోరింది. భూ, పర్యావరణ పరీక్షలు సరిగా చేయలేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు రెండేళ్లలోనే నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు కాళేశ్వరం ప్రాజెక్టు బలైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. కేసీఆర్, బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.” అని కిషన్ రెడ్డి అన్నారు.