బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తమకు బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని.. ఆ పార్టీ ప్రచార వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారని తెలిపారు. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.
“బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫేక్ గ్యారంటీలు ప్రజలు నమ్మటం లేదు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోను రూపొందించాం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అవినీతి లేని పరిపాలన అందిస్తాం. గత కాంగ్రెస్, ప్రస్తుతం బీఆర్ఎస్ పాలన అవినీతిమయమైంది. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజల సంపదను దోచుకున్నారు. మేం అధికారంలోకి రాగానే ఆ సంపదనంతా తిరిగి ప్రజలకు పంచుతాం. ఎక్కడికి వెళ్లినా బీజేపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడుతున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం.” అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.