బీఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కుంగిన ప్రాజెక్టు పటిష్ఠంగా ఉందనటం విడ్డూరమని మండిపడ్డారు. 3 పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఊరూరా తిరిగి బీఆర్ఎస్ బండారం బట్టబయలు చేస్తామని అన్నారు.
“కాళేశ్వరం కామధేను ఎట్లా అయితుందో కేసీఆర్ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు రకాల సంక్షోభానికి కారణమైంది. సాగునీరు, ఇంజినీరు వ్యవస్థ, నిధుల సంక్షోభానికి గురైంది. ఫాంహౌజ్ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రాజెక్టు చేపట్టారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చారు. డిజైన్లను కూడా తరచూ మార్చుకుంటూ పోయారు. మార్చిన డిజైన్లకు కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోలేదు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైన ప్రదేశం కాదని సీడబ్ల్యూసీ చెప్పింది. సీడబ్ల్యూసీ హెచ్చరికను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పంప్‌హౌస్‌లు మునిగుతాయని హెచ్చరించినా పట్టించుకోలేదు.” అని కోదండారం మండిపడ్డారు.