మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. దిల్లీలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే బలంగా కనిపిస్తోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందువల్లే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని.. అంతే కానీ పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమమే తన ధ్యేయమని.. పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడలేదని చెప్పారు.
హై కమాండ్ అవకాశం ఇస్తే మునుగోడులో పోటీ చేసి కాంగ్రెస్‌కు విజయం సాధించి తీసుకువస్తానని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గజ్వేల్‌లోనూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని.. కాంగ్రెస్‌ను తప్పకుండా ఎన్నుకుంటారన్న నమ్మకం తనకు ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు.