మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్‌ చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి ఎంపీ , తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన నకిరేకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. కచ్చితంగా ఈ సారి మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఓడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ మాటల్లోనే ఉందని.. నిజంగా అమల్లో మాత్రం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని.. ఓవైపు వాన లేక.. ఇప్పుడు విద్యుత్ లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు.