తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక తాజాగా వారందరికి శాఖలు కూడా కేటాయించారు. సీఎం రేవంత్ తన వద్ద హోం శాఖ, పురపాలక శాఖ ఉంచుకున్నారు. మిగతా మంత్రులకు పలు శాఖలు కేటాయించగా ఆరు శాఖలు మాత్రం మిగిలిపోయాయి. మంత్రివర్గ విస్తరణలో ఈ శాఖలకు మంత్రులను కేటాయించనున్నట్లు సమాచారం.
మరోవైపు రోడ్లు, భవనాల శాఖ మంత్రిత్వ శాఖను సొంతం చేసుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, సన్నిహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ అండ్ బీ నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తన బాధ్యతను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఈ సందర్భంగా కోమటిరెడ్డి అన్నారు. తన శాఖలో పురోగతి సాధించడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.