వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు నీటి విషయమై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా 2 రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే భేటీ కానున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు… రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై కమిటీ చర్చించనున్నట్లు సమాచారం.
రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిని ఎదుర్కొనే విషయమై చర్చ జరగనుంది. రెండు జలాశయాల్లోనూ కొద్దిపాటి నీరు మాత్రమే ఉన్న తరుణంలో కేవలం తాగునీటి అవసరాల కోసం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయమై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ఈ నెల నాలుగో తేదీన కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా… ఈఎన్సీలు హాజరు కానందున ఇవాళ్టికి వాయిదా వేశారు.
మరోవైపు తెలంగాణలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేకపోవడంతో జలాశయాలు అడుగుంటుతున్నాయి. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా.. కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.