తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లోనే బీజం పడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణను రెండుసార్లు కేసీఆర్ చేతుల్లో పెట్టారని.. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని పనులు జరిగాయో చూడాలని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఈ 9 ఏళ్లలో ఎన్ని పనులు జరిగాయో గమనించాలని ప్రజలను కోరారు. కరీంనగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా జలకళే కనిపిస్తోందని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పింఛను రూ.5 వేలు చేస్తామని.. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.
“చదువుకుంటాననే పిల్లలకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నాం. మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు అనేకమంది చూస్తున్నారు. కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీ ఈ ఐదేళ్లలో ఏదైనా పని చేశారా? గంగుల కమలాకర్‌పై పోటీ అంటేనే అందరూ పారిపోతున్నారు. కరీంనగర్‌లో పోటీ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్, బీజేపీ నేతలకు తెలుసు. మోదీ ఎవరికి దేవుడో బండి సంజయ్ చెప్పాలి. మోదీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చినవారు బీజేపీకి.. రైతుబంధు వచ్చినవారు బీఆర్ఎస్కు ఓటేయాలి. కేసీఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదు. 9 ఏళ్లుగా అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నాం. నిజమైన హిందువు ఎవరూ ఇతర మతాలపై దుమ్మెత్తి పోయరు. అభివృద్ధి అంటే పాఠశాలలు, ఆస్పత్రులు, కాలవలకు పునాదులు తీయాలి. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు బాగుపడుతున్నాయి.” అని కేటీఆర్ అన్నారు.