తెలంగాణలో ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించే వాళ్లు కాదని, గల్లాపల్లి ప్రశ్నించేటోళ్లు కావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి బాకా ఊదేటోళ్లు కావాలో.. మేధావులు కావాలో గ్రాడ్యుయేట్లు తేల్చుకోవాలని పేర్కొన్నారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బ్లాక్‌మెయిలర్, లాబీయింగ్ చేసి పైశాచిక ఆనందం పొందేవారు కావాలా? ప్రజాసమస్యలు పరిష్కరించేవాళ్లు కావాలా? ఆలోచించుకోవాలి’. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని అన్నారు. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు ఓటుతో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గల్లాపట్టి నిలదీసేందుకు రాకేశ్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చదువుకున్న వ్యక్తులుగా మాట్లాడకుండా ఉందామా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.