తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి శ్రీ పాంచనారసింహుడి సన్నిధిలో ఇవాళ్టి నుంచి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవాళ ఉదయం 8:30 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. ఇక ఈరోజు సాయంత్రం జరిగే అంకురార్పణ క్రతువులతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. స్వామి వారి జయంతి ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రికి భారీగా భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు.
మరోవైపు ఆదివారం రోజు సెలవు కావడంతో యాదాద్రి క్షేత్ర సందర్శనకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక వాడలోని రహదారులు, పార్కింగ్ ప్రాంతం, వ్రత మండపం, పుష్కరిణి ప్రాంగణం, మండపాలు కిక్కిరిశాయి. రద్దీ అధికంగా ఉండటంతో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.85,33,262 ఆదాయం సమకూరింది.