సిరిసిల్లలో యువ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకొస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదని మండిపడ్డారు. తమను గెలిపించాలని కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇస్తోందని ధ్వజమెత్తారు. మోదీ దేవుడని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్న మంత్రి కేటీఆర్.. ఇచ్చిన హామీలు మాత్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
‘ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఏమైంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది. ఎన్నికల వేళ ప్రజలు ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలి. అభివృద్ధి కులం, సంక్షేమమే మతంగా పనిచేస్తున్నాం. కులం పేరిట ఒకరు.. మతం పేరిట మరొకరు రాజకీయాలు చేస్తున్నారు. విజన్ ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా ఆలోచించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల మాదిరిగా పనిచేయాలి.’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.