కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్రంలో అంధకారం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్కు పవర్ ఇస్తే ప్రజల పవర్ తీసేస్తారని అన్నారు. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో.. తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ సర్కార్.. గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోందని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి ద్వారా 1,226 గ్రామాలు, జంట నగరాలకు తాగునీరు.. పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీరు.. మహబూబ్‌నగర్, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.
“నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. దేశ జనాభాలో 3 శాతం ఉన్న రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ స్ఫూర్తిగా ఉంటుంది. పల్లెల జరిగిన అభివృద్ధి చూసి రాష్ట్రానికి 30 అవార్డులు కేంద్రమే ఇచ్చింది. పట్టణ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్. అటవీ విస్తరణ పెంపులో దేశంలోనే నంబర్ వన్ స్థానం తెలంగాణది. హరితహరం కింద 273 కోట్ల మెుక్కలు నాటాం.” అని తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని కేటీఆర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.