రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ముస్తాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలవాల్సిందేనని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను మారుస్తున్న ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఎల్‌ఆర్‌ఎస్‌పై రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో రేపు ఎల్‌ఆర్‌ఎస్‌పై నిరసన తెలపాలని చెప్పారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవేరుస్తానని రేవంత్ మాట తప్పారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని అన్నారు. కరీంనగర్‌కు బండి సంజయ్ చేసిందేమీ లేదన్న కేటీఆర్ అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఈనెల 12న కరీంనగర్‌లో ‘కదన భేరి’ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.