వేసవి పూర్తి స్థాయిలో రాకముందే.. బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నగరంలోని యాలంక, కనకపుర, వైట్ ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో నివసించే వారిని నీటి సమస్య వెంటాడుతోంది. ఈక్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నివసించే వారిలో ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని
నియమించనున్నట్లు తెలిపింది.
‘గత నాలుగు రోజులుగా బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్ బోర్డు నుంచి నీరు రావడం లేదు. ప్రస్తుతం బోర్ల ద్వారా నీరు అందిస్తున్నాం. హౌసింగ్ సొసైటీలో నివసించేవారు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని కోరుతున్నాం. దీనివల్ల వేసవిలో ఎక్కువ రోజులు నీరు వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే.. వారికి రూ. 5వేలు జరిమానా విధిస్తాం. ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తారు’ అని వైట్ఫీల్డ్లోని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ గృహసముదాయాల్లోని వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.