ఫార్ములా – ఈ రేస్ ఇష్యూ పై గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ – కార్ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డి పైనే అని అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలోనే జరిగాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాడని.. 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఈవో ను కలిసి హైదరాబాద్ కి రావాలని చంద్రబాబు అడిగారని తెలిపారు కేటీఆర్. కానీ చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ కి రేసింగ్ రాలేదని తెలిపారు. అప్పట్లోనే గోపాన్ పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు.
ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాలలో రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాలు ఉందని తెలిపాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పట్లో హైదరాబాద్ కి రేసింగ్ రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక తనపై నమోదు చేసిన కేసులో అసలు అవినీతి లేదని అన్నాడు కేటీఆర్. “ఏం చేసుకుంటావో చేసుకో రేవంత్ రెడ్డి.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పు చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.