గ్రేటర్ హైదరాబాద్‌లో ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటగా మూసీ నదిపై నిర్మించే వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు. పీర్జాదిగూడలో మూసీపై నిర్మించే వంతెనకు, ఉప్పల్ శిల్పారామం వద్ద, మూసారాంబాగ్‌లో మూసీ నదిపై నిర్మించే వంతెనకు శంకుస్థాపన చేస్తారు.
ఆ తర్వాత దుర్గం చెరువు వద్ద ఎస్టీపీని, మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని.. కేసీఆర్ సారథ్యంలోనే భాగ్యనగరం విశ్వనగంరా పేరుగాంచుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 168 కోట్ల రూపాయల వ్యయంతో 5 వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రోక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. ఈ వంతెనల నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. వంతెనల నిర్మాణం వల్ల ప్రయాణం మరింత సులభంగా మారుతుందని వెల్లడించారు.