బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. గురువారం రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత మేడిగడ్డకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. మొదట కరీంనగర్ లోని లోయర్ మానేరు రిజర్వాయర్ ను ఈ టీమ్ పరిశీలించింది. అనంతరం రామగుండంలో విశ్రాంతి తీసుకుంది. ఇవాళ ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. మరికాసేపట్లో కన్నెపల్లి పంపు హౌజ్‌కు చేరుకోనున్నారు.
పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి.. అక్కడ గోదావరి నది ఉద్ధృతిని పరిశీలిస్తారు. కాగా అంతకుముందు ఇవాళ ఉదయం గోదావరిఖనిలో సింగరేణి క్వాటర్ల కూల్చివేత బాధితులు కేటీఆర్‌ను కలిసి తమ గోడును చెప్పుకున్నారు. గోదావరిఖని లక్ష్మినగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్‌మెంట్ అంటూ సింగరేణి క్వాటర్లు కూల్చివేశారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్‌ను వేడుకున్నారు. బాధితుల విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందిచారు.