దేశాన్ని నాశనం చేసిన రెండు పార్టీలకు బీ టీమ్‌గా ఉండాల్సిన కర్మ బీఆర్ఎస్కు లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఏ పార్టీకి బీ టీమ్ కాదని.. తమది ప్రజల టీమ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించడమే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. దేశంలో తామిద్దరే ఉండాలని బీజేపీ, కాంగ్రెస్‌లు కోరుకుంటున్నాయని.. మధ్యలో వచ్చిన వారిని బీ టీమ్‌గా ముద్ర వేస్తుంటారని కేటీఆర్ మండిపడ్డారు.
‘నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌లో మా పార్టీ టార్గెట్‌గా మాట్లాడారు. దీన్ని బట్టి మా పార్టీ విస్తరిస్దోంని స్పష్టమైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మాజీ ఎమ్మెల్యేలు, ఒడిశాలో మాజీ సీఎం గిరిధర్ గుమాంగ్ మా పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ అక్కడి పెద్ద ప్రాంతీయ పార్టీ మా పార్టీతో సంప్రదింపులు జరుపుతుంది. ఇవన్నీ మోదీకి తెలుసు. అందుకే మధ్యప్రదేశ్‌లో కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ, అక్కడి ప్రజలకు అప్పీల్ చేస్తున్నారంటే ఇది కచ్చితంగా పెరుగుతున్న మా బలానికి, ప్రాబల్యానికి నిదర్శనం.’ అని కేటీఆర్ అన్నారు.