హైదరాబాద్ మలక్‌పేటలో ఐటెక్ న్యూక్లియస్ ఐకానిక్ ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బిలాలా, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఐకానిక్ ఐటీ పార్కు అందుబాటులోకి వచ్చిన తర్వాత మలక్‌పేట్ టీవీ టవర్‌ను మరిచిపోయి అందరు ఐటీ టవర్ పేరుతో ఆ ప్రాంతం గుర్తుండిపోతుందని అన్నారు.
బీజేపీ పార్టీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయంలో 18 రాష్ట్రాల కంటే ముందందని పునరుద్ఘాటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత 9 ఏళ్లలో మత ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవని.. త్వరలో మలక్‌పేట్‌లో స్కైవాక్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
“గతేడాది 33% ఉపాధి కల్పన నుంచీ 44 శాతానికి చేరుకున్నాం. ఐటీ అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నలువైపులా విస్తరించాలనే ఆలోచనతో ఉప్పల్ కొంపల్లి మలక్ పేట్ లో ఐటీ టవర్ లను ఏర్పాటు చేశాం. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. గతంలో ఎప్పుడూ చూసిన 9 నుంచీ 10 రోజుల కర్ఫ్యూ వాతావరణం ఉండేది. మహబూబ్‌నగర్ వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడిన ప్రధాని మోదీకి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పథకాలు కనిపించడం లేదా. వచ్చే ఏడాది లోపు ఐటీ టవర్ పనులు పూర్తి చేస్తాం.” అని కేటీఆర్ తెలిపారు.