హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. పది నిమిషాల వర్షానికి రహదారులపై వరద పారుతూ చెరువులను తలపిస్తాయి. అయితే ఈ వరద సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ నడుం బిగించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రూ.20వేల కోట్లతో హైదరాబాద్ లో వరద నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2036 నాటికి నగరంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించే స్థాయిలో ఆధునిక స్టేడియాలు నిర్మిస్తామని వెల్లడించారు.
రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం యూ-ఫెర్‌వాస్(యూనియన్ ఆఫ్ ఫెడరేషన్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్) ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2052 వరకు నీటి సమస్య తలెత్తకుండా నీటి వనరులను అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రస్తుతం 70 కిలోమీటర్ల మెట్రోరైలును రాబోయే కాలంలో 400 కిలోమీటర్లకు పెంచుతామని ప్రకటించారు. చెత్తతో ప్రస్తుతం 24 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా.. దాన్ని 100 మెగావాట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఎయిమ్స్ తరహాలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే ఆసుపత్రులను అభివృద్ధిపరుస్తామని హామీ ఇచ్చారు.