కేసీఆర్ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికి కనిపిస్తోంది కానీ.. విపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు. భాగ్యనగరంలో ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని బీజేపీ ఎంపీ సన్ని డియోల్ అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ జలవిహార్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలి.. మోదీ, రాహుల్ కాదని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని డి.కె. శివకుమార్ అంటున్నారు. హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని డి.కె. శివకుమార్ లేఖ రాశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని డీకే శివకుమార్ లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిశ్రమలన్ని కర్ణాటకకు పోతాయి. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉంది. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 24 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చాయి. కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. అని కేటీఆర్ అన్నారు.