సంపద సృష్టించడం కోసం రుణాలు తీసుకువచ్చామని.. అంతే గానీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టారమని.. రుణాల మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామని తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చి.. 26 వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరామని వెల్లడించారు. వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని.. సంక్షేమానికి స్వర్ణయుగం, అభివృద్ధికి పెద్దపీట వేశామని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ వివరించారు.
‘ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. ఐటీ, పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. రాష్ట్రం నుంచి రూ.2.41 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి గతేడాదితో పోలిస్తే ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు పెరిగాయి. 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ప్రగతి నివేదికలు సమర్పించి ముందుకెళ్తున్నాం. సోనియాగాంధీ బలిదేవత అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారు కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఏళ్లతరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదు. అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నాం.’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.